డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ
ఓ మహిళ డబ్బు కోసం పెళ్లిళ్లను వ్యాపారంగా చేసుకుంది. నగలు, నగదు కోసం ఏకంగా 11 మందిని వివాహం చేసుకుంది. వీరిలో చివరి పెళ్లి కుమారుడు కట్టుకున్న భార్య చేసిన మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో ఇది జరిగింది. పోలీసుల కథనం మేరకు...
నామక్కల్ జిల్లాకు చెందిన శివషణ్ముగం (37). భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తన తల్లితో కలిసి ఉంటున్నాడు. రెండో వివాహం కోసం పెళ్లిళ్ల బ్రోకర్లు తమిళ్ సెల్వి (45), కస్తూరి (38), ముత్తులక్ష్మి, (45), వేల్ మురుగన్ (55), నారాయణన్ (56)లను సంప్ర దించగా, వారంతా కలిసి మదు రైకు చెందిన జ్యోతి అలియాస్ జ్యోతిలక్ష్మి (23)ని దీప అనే వధువుగా చూపించారు.
ఈ పెళ్లి కుదిర్చితే రూ.4 లక్షలు కమిషన్ ఇచ్చేలా శివషణ్ముగంతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ రూపేణా రూ.1.20 లక్షలు పుచ్చుకున్నారు. ఈ నెల 7న ఓ ఆలయంలో వివాహం జరిపించారు. తర్వాత భార్యను తీసుకుని శివషణ్ముగం తన ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు దీప నగలు, నగదు, వెండి వస్తువులతో ఉడాయించింది.
దీంతో ఖంగుతిన్న వరుడు.. దీప, మధ్యవర్తులకు ఫోన్ చేయగా, వారి మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసి ఉండటంతో తాను మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రూ.30 వేల నగదు. కోసం దీప ఈ పెళ్లికి అంగీకరించినట్లు తేలింది. దీపతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు బ్రోకర్లను పోలీ సులు అరెస్టు చేశారు.