బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...
మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రయాణంలో ఓ మహిళ పురిటి నొప్పులు రావడంతో అందులోనే ప్రసవించింది. ఆ తర్వాత ఆ బిడ్డను బస్సు కిటికీలో నుంచి విసిరేసింది. దీంతో గాయాలపాలైన ఆ పసికందు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీన్ని స్థానికులు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఈ ఘటనకు సంబంధించి 19 యేళ్ల యువతితో పాటు ఆమెతో ఉన్న ఓ యువకుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, రితిక ధీరే, అల్తాఫ్ షేక్‌లు గత కొంతకాలంగా పూణెలో ఉంటున్నారు. ఈ క్రమంలో రితిక గర్భందాల్చింది. తాజాగా సోమవారం రాత్రి నిండు గర్భిణి రితికతో అల్తాఫ్ పర్భణికి బయలుదేరారు. స్లీపర్ కోచ్‌లో రాత్రంతా ప్రయాణించారు. తెల్లవారుజామున రితికకు పురిటి నొప్పులు రావడంతో బస్సులోనే ప్రసవించింది. పుట్టిన బిడ్డను అల్తాఫ్ ఒక గుడ్డలో చుట్టి కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు.
బస్సులో నుంచి ఏదో వస్తువు పడటం చూసిన స్థానికులు దగ్గరకు వెళ్లి చూడగా, అందులో పసిబిడ్డ ఉన్నట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బస్సును ఆపి రితిక, అల్తాఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు. చికిత్స కోసం రితికను ఆస్పత్రిలో చేర్పించారు. తాము భార్యాభర్తలమని, బిడ్డను పెంచే స్థోమత లేకపోవడం వల్లే ఈ పని చేశామని అల్తాఫ్ విచారణలో వెల్లడించారు. అయితే, వారిద్దరూ భార్యాభర్తలు అనేందుకు ఎలాంటి ఆధారం చూపించలేకపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.