నువ్వు మా రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వీల్లేదు : అసదుద్దీన్ ఓవైసీకి కర్ణాటక పోలీసుల నోటీసు
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు పలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం బిజాపూర్‌లో ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఆ రాష్ట్ర పోలీస్ అధికారులు నోటీస్ జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయం దారుల్‌సలాంలో అసదుద్దీన్ ఓవైసీకి కర్ణాటక విజయ్‌పూర్(బిజాపూర్) జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను పోలీసులు అందజేశారు.
ఇదిలావుండగా, బిజాపూర్ సమీపం తకియా అఫ్జ్‌ల్‌పూర్‌లో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ ఒకటో తేదీన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించవలిసి ఉంది. అయితే, శాంతి భద్రతల సమస్యల కారణంగా బీజా పూర్ ప్రాంతంలో 144(3) సెక్షన నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున ఏడురోజుల పాటు ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు బిజాపూర్ జిల్లా కలెక్టర్ డి.రణదీప్ జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక పోలీసు అధికారులు అసదుద్దీన్ ఓవైసీకీ అందజేశారు.