1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2016 (08:49 IST)

ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి.. ఒక జవాను వీరమరణం...

భారత ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒక జవాను వీరమరణం చెందగా, మరికొందరు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు.

భారత ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒక జవాను వీరమరణం చెందగా, మరికొందరు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఐదారుగురు ఉగ్రవాదులు రాత్రి 8.25 గంటల సమయంలో.. సమీపంలోని ఒక పబ్లిక్‌ పార్కు గుండా 46 రాష్ట్రీయ రైఫిల్స్‌ క్యాంపులోకి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. తుపాకులతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. జవాన్లకు, ఉగ్రవాదులకు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఒక జవాను మరణించగా.. ఇద్దరు భారతీయ సైనికులు గాయపడ్డారు. 
 
మరోవైపు.. జమ్మూ జిల్లాలోని పల్లన్‌వాలా సెక్టర్‌లో పాక్‌ సైనికులు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు, పేలుళ్లకు తెగబడ్డారు. రాత్రి 7.15 గంటలకు ఈ కవ్వింపుచర్యలు ప్రారంభమయ్యాయని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. భారత జవాన్లు పీవోకేలో ఉగ్ర శిబిరాలపై సర్జికల్‌ సై్ట్రక్స్‌ జరిపినప్పటి నుంచి... పాక్‌ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది ఆరోసారి అని రక్షణ శాఖ పీఆర్‌వో పేర్కొన్నారు. 
 
మరోవైపు.. యురీ దాడుల తర్వాత, దేశ రాజధానిని ఉగ్రవాదులు లక్ష్యం చేసుకొన్నారన్న వార్తలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాజధానిలో నివసిస్తున్న ప్రముఖుల భద్రతని అత్యవసరంగా సమీక్షించారు. అలాగే, నవరాత్రి ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.