మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 జూన్ 2021 (09:34 IST)

బీజేపీకి మరోషాక్ : మమత చెంతకు మరో నేత రాజీబ్ బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఉన్న, బెంగాల్‌లో కీలక నేతగా ఉన్న ముకుల్ రాయ్ అధికార టీఎంసీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఆ మరుసటి రోజే పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీబ్ బెనర్జీ కూడా టీఎంసీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజీబ్ బెనర్జీ తాజాగా టీఎంసీ నేత కునాల్ ఘోష్‌తో శనివారం భేటీ కావడం పార్టీ మారతారన్న ఊహాగానాలకు తావిచ్చింది.
 
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో డోమ్జూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన రాజీబ్ బెనర్జీ ఓటమి పాలయ్యారు. టీఎంసీ అధికార ప్రతినిధి అయిన కునాల్ ఘోష్‌ను నిన్న కోల్‌కతాలో ఆయన నివాసంలోనే కలిశారు. అయితే, ఇది మర్యాదపూర్వక భేటీయేనని ఇరువురు నేతలు చెబుతున్నప్పటికీ పార్టీ మార్పు తథ్యమని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్-మే నెలల్లో పార్టీ వీడిన నేతలు, కార్యకర్తలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పడం గమనార్హం. అయితే, ఇపుడు పార్టీ నేతలను తిరిగి చేర్చుకునే విషయంలో రెండు కేటగిరీలుగా కేటాయించి, తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నారు.