మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: శుక్రవారం, 5 జూన్ 2020 (22:26 IST)

మొదటి తండ్రి స్థానంలో రెండో తండ్రిని చూడలేక చంపేసాడు

పదవ తరగతి చదువుతున్న పదిహేనేళ్ల బాలుడు సవతి తండ్రిని దారుణంగా చంపిన ఘటన యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఇనుప రాడ్‌లతో కొట్టి కిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే బాలుడి తండ్రి ఇటీవల గుండెపోటుతో మరణించాడు. అది జరిగి నెల రోజులు కూడా కాకముందే తల్లి రెండో వివాహం చేసుకోవడం అతడికి నచ్చలేదు.
 
సవతి తండ్రిని మనస్పూర్తిగా అంగీకరించలేకపోయాడు. తల్లి ఎన్నిసార్లు చెప్పిచూసినా కొడుకు మాటవినలేదు. పైగా ద్వేషం పెంచుకుని మనసులో రగిలిపోయాడు. ఎలాగైనా సవతి తండ్రిని హతమార్చాలని పన్నాగం పన్నాడు. స్నేహితులతో కలిసి మాటువేసాడు, తన సోదరునితో కలిసి బైక్‌పై వస్తున్న అతడిని అడ్డుకుని, అందరూ కలిసి దాడి చేసారు.
 
ఇనుప రాడ్లతో రక్తం చిందేలా కొట్టారు. తుపాకీతో కాల్చడంతో బుల్లెట్లు దిగి అక్కడికక్కడే మరణించాడు. మృతుని సోదరుడు అక్కడ నుండి పారిపోయాడు. కొడుకు ఇంటికి వచ్చి తల్లితో విషయం చెప్పి పరారయ్యాడు. పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు, బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు.