శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (19:00 IST)

బ్రేవో తెలంగాణ పోలీసు... బాలీవుడ్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు స్పందించారు. తెలంగాణ పోలీసుల చర్యను ప్రశంసిస్తూ వారిని గట్టిగా సమర్థించారు.

ప్రముఖ నటుడు రిషి కపూర్, అనుపమ్ ఖేర్, వివేక్ ఒబెరాయ్, సోనూ సూద్‌తోపాటు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలంగాణ పోలీసుల చర్యకు మద్దతు పలికారు. బ్రేవో తెలంగాణ పోలీసు. మై కంగ్రాచ్యులేషన్స్ అని రిషి కపూర్ ట్వీట్ చేశారు.

వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేస్తూ దిశ హత్య కేసులో సత్వర న్యాయాన్ని అత్యంత శక్తివంతంగా ఇచ్చినందుకు తెలంగాణ పోలీసులను అభినందించారు.చట్టాన్ని ఉల్లంఘించి దాని వెనుక దాక్కునే రాక్షసులకు ఇదో బలమైన సందేశమని, అలాంటి రాక్షసులంతా భయంతో ఇప్పుడు గజగజ వణుకుతుంటారని వివేక్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ పోలీసులను రియల్ హీరోస్‌గా ప్రముఖ నటుడు సోనూ సూద్ అభివర్ణించారు. రేప్ వంటి నేరానికి పాల్పడి ఎంత దూరం పారిపోగలరని రకుల్ ప్రీత్ సింగ్ ప్రశ్నిస్తూ తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. నలుగురు రేపిస్టులను కాల్చిచంపిన తెలంగాణ పోలీసులకు అనుపమ్ ఖేర్ అభినందనలు తెలియచేశారు.

ఇదిలా ఉంటే గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ దడ్లానీ మాత్రం తెలంగాణ పోలీసుల చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్య పట్ల తాను సంతోషంగా లేనని, దిశకు న్యాయం జరిగిందని ఎవరైనా భావిస్తే అది తప్పని ఆయన అన్నారు.

న్యాయ వ్యవస్థ ఘోరంగా విఫలమైన రోజులో జీవిస్తున్న మనం న్యాయం లభించింది అంటూ సంబరాలు చేసుకుంటున్నామని అన్నారు. విచారణ లేకుండా ప్రజలను పోలీసులు చంపడం వల్ల అది ఏదో ఒకరోజు మీ ఇంటి తలుపునే తడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.