శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (08:15 IST)

పారిపోయిన వధువు.. మైనర్ చెల్లిని పెళ్లాడిన వరుడు.. ఎక్కడ?

మరికొన్ని గంటల్లో పెళ్లి తంతు పూర్తికావాల్సి వుంది. ఇంతలో వధువు తన ప్రియుడుతో కలిసి పారిపోయింది. దీంతో వరుడు మరో గత్యంతరం లేక మైనర్ అయిన వధువు చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన ఒడిషా రాష్ట్రంలోని కలహండీ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జైపట్న పోలీసుస్టేషను పరిధిలోని మాల్పాడా గ్రామానికి చెందిన వధువు 26 ఏళ్ల వయసున్న వరుడితో వివాహం నిశ్చయం చేశారు. మరికొద్దిసేపట్లో పెళ్లి అనగా వధువు తన ప్రియుడితో కలిసి పారిపోయింది.
 
అంతే వధువు చెల్లెలైన 15 ఏళ్ల వయసున్న మైనర్ బాలికకు నచ్చచెప్పి ఆమెను వరుడికిచ్చి పెళ్లి జరిపించేశారు. వధువు పారిపోవడంతో  నివ్వెర పోయిన వరుడు అదే ముహూర్తంలో వధువు చెల్లైలైన మైనర్ బాలిక మెడలో తాళి కట్టేశాడు. పెళ్లి అనంతరం అత్తవారింటికి వెళ్లిన 15 ఏళ్ల బాలికా వధువును కలహండి జిల్లా పిల్లల రక్షణ అధికారి సుకాంతి బెహెరా రక్షించారు.
 
బాల్యవివాహం చట్టవిరుద్ధమని వధువు, వరుడి కుటుంబసభ్యులకు తెలియదని సుకాంతి చెప్పారు. 10వతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న బాలికా వధువును రక్షించి పుట్టింటికి చేర్చామని, బాలిక తన పుట్టింటి నుంచి పరీక్షకు హాజరుకావాలని సూచించారు. 
 
రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ చేసి బాలికకు 18 ఏళ్ల వయసు వచ్చే దాకా అత్తింటికి పంపించవద్దని చెప్పడంతో వారు అంగీకరించారని బెహెరా చెప్పారు. తన కుమార్తె అయిన వధువు పారిపోవడంతో చిన్న కూతుర్ని వరుడి కుటుంబం ఒత్తిడి కారణంగా ఇచ్చి పెళ్లి చేశానని బాలిక వధువు తండ్రి చెప్పడం కొసమెరుపు.