గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (09:10 IST)

భారతమాల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలో టెండర్లు..

bharatamala
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతమాల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారులు, రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఈ ప్రాజెక్టులు గత యేడాది మంజూరైనప్పటికీ.. టెండర్ల ప్రక్రియను కేంద్రం స్తంభింపజేసింది. తాజాగా ఈ పనులన్నీ ఏక కాలంలో ప్రారంభించేందుకు ఆమోదముద్ర వేసింది. 
 
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. మొత్తం 384 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారుల నిర్మాణానికి తొలుత 6 వేల 646 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుతం ఆ వ్యయాన్ని రూ.6,280 కోట్ల రూపాయలకు తగ్గించింది. ఈ ప్రాజెక్టుల్లో కొండమోడు - పేరేచెర్ల సెక్షన్‌ విస్తరణ సైతం ఉంది.
 
జాతీయ రహదారి నెంబర్ 167ఏజీలో 49.917 కిలో మీటర్ల మార్గాన్ని 881.61 కోట్ల రూపాయలతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
 
ఎన్‌హెచ్167కేలో సంగమేశ్వరం - నల్లకాలువ, వెలిగొండ - నంద్యాల మధ్య 62.571 కిలోమీటర్ల మార్గాన్ని 601 కోట్ల రూపాయల వ్యయంతో రెండు వరుసలుగా విస్తరిస్తారు.
 
కొత్తగా జాతీయ రహదారిగా ప్రకటించిన ఎన్‌హెచ్‌ 167కేలో నంద్యాల - కర్నూలు/కడప బోర్డర్‌ సెక్షన్‌ను 62 కిలో మీటర్ల మేర ఆధునికీకరించనున్నారు. ఇందుకోసం 691 కోట్ల రూపాయలను వెచ్చిస్తారు.
 
ఎన్‌హెచ్-440లో వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు (ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా) ఉన్న 78.95 కిలోమీటర్ల రహదారిని 1,321 కోట్ల రూపాయలతో రెండు, నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
 
ఎన్‌హెచ్ 716జీ లోని ముద్దనూరు - హిందూపురం సెక్షన్‌లో 33.58 కిలోమీటర్ల మార్గాన్ని 808 కోట్ల రూపాయలతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
 
ఎన్‌హెచ్ 716జిలో ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి సెక్షన్‌ వరకు 56.5 కిలోమీటర్ల మార్గాన్ని 1,019.97 కోట్ల రూపాయలతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
 
ఎన్‌హెచ్ 516బిలో పెందుర్తి నుంచి ఎస్‌.కోట మార్గంలో ఉన్న 40.5 కిలోమీటర్ల రోడ్డును 956.21 కోట్ల రూపాయలతో 2, 4 వరుసలుగా విస్తరిస్తారు.
 
ఈ 7 ప్రాజెక్టుల్లో తొలి రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే టెండర్లు పిలవగా ఇద్దరు ఎల్‌-1గా నిలిచారు. దాంతో ఆ రెండు కంపెనీలు కోట్‌ చేసిన మొత్తానికే తాజా ధరలను నిర్ణయించి అంచనాలను సవరించారు.