ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (13:05 IST)

సీఎం పన్నీర్ సెల్వం అలా అన్నారనీ... పోలీస్‌స్టేషన్‌ను తగులబెట్టారు...

చెన్నై మెరీనా తీరం వేదికగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. మెరీనా బీచ్‌లో తిష్టవేసిన ఉద్యమకారులను ఖాళీ చేయించడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే, అక్కడి నుంచి కదిలేందుకు ఆందోళన

చెన్నై మెరీనా తీరం వేదికగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. మెరీనా బీచ్‌లో తిష్టవేసిన ఉద్యమకారులను ఖాళీ చేయించడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే, అక్కడి నుంచి కదిలేందుకు ఆందోళనకారులు మోరాయిస్తున్నారు. ఈ లోపే బీచ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఐస్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌ను దుండగులు తగులబెట్టారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్టేషన్‌పై పెట్రోల్ బాంబులతో దాడులు చేసినట్టు సమాచారం. దీంతో స్టేషన్ ముందు పార్కింగ్ చేసిన అనేక పోలీసు వాహనాలు పూర్తిగా తగలబడి పోయాయి. 
 
ఉద్యమకారుల ముసుగులో సంఘ విద్రోహశక్తులు ప్రవేశించాయని ప్రభుత్వం ఆరోపించిన కొద్దిసేపటికే పోలీస్‌స్టేషన్‌ను తగులబెట్టారు. తమిళనాడులో జల్లికట్టు నిషేధంపై శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ప్రజలు చేస్తున్న నిరసన తీవ్రతరమైంది. ఆర్డినెన్స్ జారీ చేస్తున్నట్లు ప్రకటించినా తమిళుల పోరాటం ఆగలేదు. సమస్యకు పరిష్కారం తాత్కాలిక ఆర్డినెన్స్ కాదని పూర్తి స్థాయిలో నిషేధం ఎత్తివేసే దాకా తమ పోరాటం ఆగదని తమిళులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
 
మరోవైపు జల్లికట్టుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినందున ఆందోళన విరమించాలని, గణతంత్ర దినోత్సవ వేడుకలు మెరీనా బీచ్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించిన నిరసనకారులు తమను బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు.
 
అదేసమయంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కంటికి కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 50 వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెరీనా బీచ్‌ ఆందోళన హింసాత్మకంగా మారడంతో అక్కడికి వచ్చే అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఆందోళనకారులను వెనక్కి పంపించివేస్తున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
దీనికంతటికీ కారణం.. జల్లికట్టు ఉద్యమంలోకి కొన్ని సంఘ విద్రోహశక్తులు చొరబడ్డారంటూ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై రాష్ట్ర పోలీసులు కూడా ఒక ప్రకటన చేశారు. దీంతో ఉద్యమకారుల్లో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడం, ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడం జరిగింది.