శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (16:34 IST)

ఆ ఒక్క ఎంపీ దెబ్బకు ఫ్లైట్ రూల్స్ మారిపోయాయి.. ‘నో ఫ్లై లిస్ట్‌’ పేరు చేరితే కాలు పెట్టలేరు...

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇటీవల చేసిన నిర్వాకం అందరికీ తెలిసిందే. ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టి వివాదాస్పద ఎంపీగా ముద్రవేయించుకున్నాడు. ఏప్రిల్‌ నెలలో పుణె నుంచి ఢిల్లీ వెళ్లే క్రమంలో గైక్వ

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇటీవల చేసిన నిర్వాకం అందరికీ తెలిసిందే. ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టి వివాదాస్పద ఎంపీగా ముద్రవేయించుకున్నాడు. ఏప్రిల్‌ నెలలో పుణె నుంచి ఢిల్లీ వెళ్లే క్రమంలో గైక్వాడ్‌ ఎయిర్‌ ఇండియా సిబ్బందిపై దాడి చేయడంతో విమానయాన సంస్థలు ఆగ్రహించాయి. దీంతో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌ జెట్‌, గో ఎయిర్‌ విమానాల్లో గైక్వాడ్‌ను ఎక్కించుకునేందుకు నిరాకరించాయి. ఈ అంశం లోక్‌సభను సైతం ఓ కుదుపు కుదిపింది. ఏకంగా పౌరవిమానయాన శాఖామంత్రి అశోకగజపతి రాజుపై దాడి చేసేందుకు శివసేన ఎంపీలు ప్రయత్నించారు. 
 
ఈనేపథ్యంలో... ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు పొందుపరిచారు. ఇకపై విమానాల్లో దురుసుగా ప్రవర్తించినా... విమాన సిబ్బందిపై చేయి చేసుకున్నా... సదరు ప్రయాణికుడిని ‘నో ఫ్లై లిస్ట్‌’లో చేర్చుతారు. ఒక్కసారి ఈ లిస్టులో పేరు నమోదైతే ఇక అతను ఏ విమానంలోనూ ప్రయాణించే వీలు ఉండదు. ఈ తాజా నిబంధనలను కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు ప్రకటించారు. 
 
తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా, విమానాశ్రయంలో గానీ, విమానంలో గానీ, సిబ్బందితో ఘర్షణకు దిగినా ఆ వ్యక్తి నేరం చేసినట్లుగా భావించి అతని పేరును ‘నో ఫ్లై లిస్టు’లో నమోదు చేస్తారు. దీంతో అతను విమాన టికెట్లు బుక్‌ చేసుకునే వీలుండదు. ఆధార్‌ తదితర వివరాల ద్వారా లిస్టులో ఉన్న వారిని కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ గుర్తిస్తారు. 
 
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకునే తాము ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ‘నో ఫ్లై లిస్టు’లో పేరు నమోదైన వారిపై కొంతకాలం మాత్రమే నిషేధం అమల్లో ఉంటుంది. ఆ తర్వాత సరైన ఆధారాలు చూపి యథావిధిగా విమాన ప్రయాణం చేయవచ్చు. దేశంలోని విమానయాన సర్వీసులకు మాత్రమే ఈ నిబంధనలు అమలుకానున్నాయి.