శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (14:31 IST)

కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది.. అయినా... చిదంబరం కామెంట్స్

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని, అయినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని కేంద్ర మాజీ విత్తమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. 
 
ఆయన శుక్రవారం మాట్లాడుతూ, తమ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉందన్నారు. అయినా నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామన్నారు. అన్ని రాజకీయ పక్షాలూ ఎత్తు పల్లాలను ఎదుర్కొంటున్నట్లుగానే, కాంగ్రెస్ కూడా ఎదుర్కొంటోందన్నారు.
 
అదేసమయంలో తమలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ స్థానాలను పదిలం చేసుకోవాల్సిందేనని నిర్మొహమాటంగా వెల్లడించారు. అయితే అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. 
 
గత రెండున్నరేళ్ల కంటే ముందు పార్టీ ఎన్నో విజయాలను సాధించిందని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు తాత్కాలికమేనని అన్నారు. కేరళ, తమిళనాడులో తమ ప్రభుత్వాలను స్థాపిస్తామని, అందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. 
 
ఇకపోతే, తమ పార్టీ అధ్యక్షుడుని ఎన్నుకునేది జర్నలిస్టులు కాదని, కేవలం పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, దేశంలోని 99 శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కోరుకుంటున్నారని చెప్పారు.