ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 మే 2016 (17:46 IST)

ఉత్తరాఖండ్ : 9 మంది రెబెల్స్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సబబే : సుప్రీంకోర్టు

ఉత్తరాఖండ్‌లో తిరుగుబాటు చేసిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయడం సబబేనని తేల్చి చెప్పింది. దీంతో మంగళవారం (పదో తేదీ)న ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఎదుర్కొనే బలపరీక్షలో వారు పాల్గొనడానికీ వీల్లేదని తేల్చి చెప్పింది. దీంతో ముఖ్యమంత్రి హరీశ్ రావత్ విశ్వాస పరీక్ష గెలుపొందడం ఖాయమైపోయింది. 
 
ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 71 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలున్నారు. హరీశ్ రావత్‌కు ఇద్దరు బీఎస్‌పి ఎమ్మెల్యేలు, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతివ్వనున్నారు. అంతేకాకుండా స్పీకర్ ఓటు కూడా ప్రభుత్వానికే పడనుంది. దీంతో హరీశ్ రావత్ గెలుపు నల్లేరుమీద నడకలా సాగిపోనుంది. అదేసమయంలో భారతీయ జనతా పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. తిరుగుబాటు చేసిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతించి ఉంటే హరీశ్ రావత్ ఓడిపోయి ఉండేవారు. కానీ, తీర్పు మరోలా ఉండటంతో హరీష్ రావత్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గడం దాదాపు ఖరారైపోయింది. 
 
అంతకుముందు.. తమపై వేసిన అనర్హత వేటును ఉపసంహరించాలని తొమ్మిది మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు సోమవారం ఉదయం కొట్టివేసింది. వారు అనర్హులేనంటూ మరోసారి స్పష్టం చేసింది. మంగళవారం జరగబోయే బలపరీక్షలో వారికి ఓటు వేసే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వారు సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో వారంతా హుటాహుటిన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక్కడ చుక్కెదురు కావడంతో ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి రానుంది.