మంగళవారం, 29 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 మే 2016 (12:32 IST)

కేరళలో క్రికెటర్ శ్రీశాంత్.. తమిళనాడులో హీరోలు విజయకాంత్, శరత్ కుమార్‌లు ఓటమి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతుండగా, ఈ ఫలితాల్లో పలువురు ప్రముఖులు ఓడిపోయారు. వీరిలో భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కేరళలో ఓడిపోయారు. ఈయన ఎల్.డి.ఎఫ్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. శ్రీశాంత్ బీజేపీ అభ్యర్థిగా తిరువనంతపురం స్థానం నుంచి బరిలోకి దిగారు. అలాగే, బీజేపీ పక్షాన పోటీ చేసిన మరో ప్రముఖ బీజేపీ నేత రాజశేఖరన్ కూడా ఓటమి పాలయ్యారు. 
 
ఇకపోతే తమిళనాడు రాష్ట్రంలో కింగ్‌మేకర్‌గా గుర్తింపు పొందిన సినీ హీరో విజయకాంత్ ఉళుందూరుపేట స్థానం నుంచి పోటీ చేసి రెండాకుల గాలికి కొట్టుకుని పోయారు. అలాగే, ధర్మపురి జిల్లా పెన్నాగరం స్థానం నుంచి పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి లోక్‌సభ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి అన్బుమణి రాందాస్ సైతం చిత్తుగా ఓడిపోయారు. 
 
తమిళనాడు నుంచి పోటీ చేసిన మరో ప్రముఖ నటుడు శరత్ కుమార్ సైతం జయ ప్రభంజనంలో ఓటమి చెందారు. కాగా, పశ్చిమబంగాలో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలిత, కేరళలో ఎల్డీఎఫ్, అసోంలో ఎన్డీయే కూటమి ప్రభంజనంతో అనేక మంది ప్రముఖులు ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.