శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (18:27 IST)

షహీద్ మేళా బేవర్ ఉత్తర ప్రదేశ్ అధ్యక్షుడిగా గజల్ శ్రీనివాస్

ప్రతిష్టాత్మక సంస్థ "షహీద్ మేళా బేవర్ - ఉత్తర ప్రదేశ్" అధ్యక్షుడిగా ప్రఖ్యాత గజేల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనను మేళా కమిటి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సంచాలకులు రాజ్ త్రిపాఠి ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. 
 
షహీద్ మేళా ప్రతి యేటా జనవరి 23 నుండి ఫిబ్రవరి 10 వ తేదీ వరకు నిర్వహిస్తుంటారు. స్వాతంత్ర్య సంగ్రామంలో అసువులు బాసిన త్యాగధనులకు  లక్షలాది మంది ఈ ఉత్సవంలో నీరాజనం పలుకడం ఆనవాయితీగా వస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఈ ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్ర ప్రదర్శన, కవి సమ్మేళనంలో పాల్గొని దేశభక్తిని చాటి చెబుతారని తెలిపారు. 
 
1942లో కృష్ణ కుమార్, 14 ఏళ్ళ విద్యార్థి, సీతారామ్, జమునా ప్రసాద్ త్రిపాఠిలు బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు ఎదురువెళ్లి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ పిదప లక్షలాది మంది స్ఫూర్తి పొంది బేవర్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి గుర్తుగా 1972 నుంచి షహీద్ మేళా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
 
ఈ దేశంలో మరెక్కడా లేనట్టుగా 26 మంది స్వాతంత్ర్య సమరయోధులకు "షహీద్ మందిరాన్ని" నిర్మించినట్టు రాజ్ త్రిపాఠి వెల్లడించారు. డా. గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో భవిష్యత్తులో అన్ని రాష్ట్రల్లో షహీద్ మేళ నిర్వహించి ఈ తరం ప్రజలకు స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను గుర్తుకు తెస్తామని చెప్పారు. ఈ మేళాను త్వరలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు.