శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (08:47 IST)

ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు

supreme court
ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ ఎన్నికల బాండ్ల పథకం గత 2018లో తీసుకొచ్చారు. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణనను గత యేడాది నవంబరు రెండో తేదీనే పూర్తి చేసి, తీర్పును రిజర్వులో ఉంచింది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ తుది తీర్పును వెలువరించనుంది. 
 
రాజకీయ పార్టీల నిధుల సమీకరణకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకం చట్టబద్ధతను సవాలు చేస్తూ ఏడీఆర్, సీపీఎం సహా మరికొందరు పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలోపే ఈ పథకంపై సమగ్ర విచారణ జరపాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో, గతేడాది అక్టోబర్ 31న ఈ పిటిషన్లపై వాదనలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 2న కోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది.
 
రాజకీయ పార్టీలు పారదర్శకంగా నిధులు సమీకరించేందుకు వీలుగా 2018 జనవరి 2న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకున్న వారు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.వెయ్యి నుంచి రూ.కోటి వరకూ వివిధ మొత్తాలకు ఎన్నికల బాండ్స్ జారీ చేస్తారు. ఇవి వివిధ ఎస్బీఐ బ్రాంచీల్లో కొనుగోలు చేయొచ్చు. భారత పౌరులు, భారత్‌లో స్థాపించిన లేదా ఇన్‌కార్పొరేట్ అయిన కంపెనీలు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందించవచ్చు. 
 
ఈ పథకంలో దాతల వివరాలు గోప్యంగా ఉంచుతారు. ప్రజలకు, పార్టీలకు కూడా ఈ దాతల వివరాలు వెల్లడించరు. అయితే, ఆడిటింగ్ అవసరాల కోసం ప్రభుత్వం, సంబంధిత బ్యాంకులు దాతల వివరాలు సేకరిస్తాయి. ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లు పొందిన పార్టీలే ఈ పథకానికి అర్హులు. అధీకృత బ్యాంకుల్లోనే రాజకీయ పార్టీలు ఈ బాండ్లను క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది.