మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 3 జూన్ 2020 (20:13 IST)

పైనాపిల్ పండులో పటాసులు, ఆకలితో తిన్న ఏనుగు...

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
కొందరు చేసిన పనికి గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే... కేరళ లోని పాలక్కడ్‌, మలప్పురం జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఉండే ఏనుగు ఆహారం కోసం సమీపంలోని గ్రామ శివారుకి వచ్చింది. ఐతే తమ పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని వాటిని కాపాడుకునేందుకు స్థానికులు బాణసంచాతో నింపిన పైనాపిల్‌ పండ్లను అక్కడ పెట్టారు. ఐతే ఆకలితో వున్న ఏనుగు ఆ పండ్లను నోటితో అందుకుంది.
 
అంతే... పైనాపిల్ నోటి వద్దకు వెళ్లగానే టపాసులు పెద్ద శబ్దం చేస్తూ పేలాయి. దాంతో ఏనుగు తీవ్ర గాయాలపాలై అల్లాడిపోయింది. ఏనుగు నాలుక, నోరు, తొండం తీవ్రంగా గాయాలు కావడంతో సమీపంలోని నదిలోకి వెళ్లి గాయాలపై నీళ్లు చల్లుకుంటూ అలానే వుంది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు.
 
కానీ ఆ ఏనుగు నది మధ్యలోనే ప్రాణాలు విడిచింది. చనిపోయిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించగా దాని కడుపులో నెల రోజుల గున్న ఏనుగు పిల్ల వున్నట్లు గుర్తించారు. పైనాపిల్ టపాసుల ధాటికి తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు రెండూ చనిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోను ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌కు చెందిన అధికారి మోహన్‌ కృష్ణన్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు.