దత్తత తండ్రే కాటేస్తే... ముగ్గురు బాలికలపై ఏళ్ల తరబడి అత్యాచారం... మాజీ శాస్త్రవేత్త అరెస్టు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మానవత్వం మంటకలిసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన దత్తత తండ్రే ముగ్గురు కుమార్తెల (బాలికలు)పై సంవత్సరాల తరబడి అత్యాచారం చేస్తూ వచ్చాడు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మానవత్వం మంటకలిసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన దత్తత తండ్రే ముగ్గురు కుమార్తెల (బాలికలు)పై సంవత్సరాల తరబడి అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ దారుణానికి పాల్పడిందీ నిరక్షరాస్యుడో కాదు.. ఏకంగా ఆయనో మాజీ శాస్త్రవేత్త. అభంశుభం ఎరుగని చిన్నారుల్ని దత్తత తీసుకుని ఈ తరహా దారుణానికి పాల్పడుతూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధక సంస్థ (నీరి-ఎన్‌ఈఈఆర్‌ఐ)కి చెందిన శాస్త్రవేత్త మక్సూద్ అన్సారీ. ఈయన వయసు 72 యేళ్లు. ప్రస్తుతం పదవీ విరమణ చేశారు. గతంలో రెండు వివాహాలు చేసుకున్న అన్సారీ సంతానం పొందలేకపోవడంతో, సదరు బాలికలను చిన్న వయసులోనే దత్తతకు తీసుకున్నారు. ప్రస్తుతం వీరి వయసు 6, 11, 16 యేళ్లు. అయితే, ఈ ముగ్గురిలో పెద్ద వయసున్న పదహారేళ్ల బాలిక.. దత్తత తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఒకటో తరగతి నుంచే లైంగికంగా మోసం చేశారనీ, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పారని పేర్కొంది.
మరో బాలిక వయసు పదకొండేళ్లుకాగా, ఇంకో బాలికకు ఆరున్నరేళ్లున్నాయి. చాలా ఏళ్లుగా తమను లైంగికంగా వేధిస్తూ, బెదిరిస్తున్నట్లు వారు ఆరోపించారు. ముగ్గురిలో పెద్దమ్మాయి స్నేహితుల కుటుంబం ద్వారా ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. వార్ధా రోడ్‌లోని అజ్నిస్క్వేర్‌లో ఉండే వారి నివాసం నుంచి బాలికల్ని రక్షించి ప్రభుత్వ ఆశ్రయానికి తరలించినట్లు తెలుస్తోంది. అలాగే, పెద్ద బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్సారీని నాగ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.