గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఏప్రియల్ 2025 (16:37 IST)

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

tourist leaves
పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడి తర్వాత కాశ్మీర్ నుంచి కేవలం 6 గంటల్లో 3300 మంది పర్యాటకులు వెళ్లిపోయారని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. పహల్గామ్‌లోని బైసరన్ లోయలో భీకర ఉగ్రదాడి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసిందని, దీంతో వందల సంఖ్యలో పర్యాటకులు కాశ్మీర్‌ను వీడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
"ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి పర్యాటకుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ విమానాశ్రయం నుంచి 20 విమానాలు వెళ్లాయి. 3337 మంది ప్రర్యాటకులు ఈ ప్రాంతాన్ని వీడారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమాన సర్వీసులను కూడా అందుబాటులో ఉంచాం" అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పోస్టులో రాసుకొచ్చారు. 
 
మరోవైపు, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్‌లో పర్యటించేందుకు రద్దయ్యాయని ఢిల్లీలోని పలు పర్యాటక రవాణా సంస్థలు బుధవారం వెల్లడించాయి. ఉగ్రదాడి తర్వాత పర్యాటకులు కాశ్మీర్‌లో ఉండేందుకు, పర్యటించేందుకు సహాసం చేయడం లేదని టూరిస్ట్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.