ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఉప్పొంగుతున్న బ్రహ్మపుత్ర - అస్సాంలో వరదలకు 25 మంది మృతి

assam floods
ఈశాన్య రాష్టమైన అస్సాంలో భారీ వరదలు సంభవించాయి. బ్రహ్మపుత్రతో పాటు దాని ఉప నదులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో 31 జిల్లాల్లో ఈ వరద ప్రభావం అధికంగా ఉంది. ఈ వరదల కారణంగా 4291 గ్రామాలు నీట మునిగాయి. ఫలితంగా 31 లక్షల మందికి నిరాశ్రయులయ్యారు. అస్సాం రాజధాని గౌహతిలోనూ ఈ వరద నీటి ప్రభావం అధికంగా ఉంది. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 25 మంది చనిపోయారు. 
 
ఈ వరదల్లో చిక్కుకున్నవారిని సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. చిరంగ్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 100  మంది గ్రామస్థులను తాడు సాయంతో కాపాడారు. చిన్నపాటి పడవుల సాయంతో వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన 514 సహాయక శిబిరాల్లో 1.56 లక్షల మంది ఆశ్రయం పొందారు.  
 
ప్రధాని నరేంద్ర మోడీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి తాజా పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్న విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 
 
గువహటి వీధుల్లో వరద నీరు పారుతుండగా.. పెద్ద పెద్ద చేపలు ఈదుకుంటూ వెళుతున్న దృశ్యాలు అక్కడి వారి కంట పడుతున్నాయి. దీంతో కొందరు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇందులో ఒక వీడియో ఆసక్తితో పాటు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.