బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (13:19 IST)

రోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళ మెడలో చైన్ గోవిందా..!

Ghaziabad woman
Ghaziabad woman
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చాలామంది తహతహలాడుతున్నారు. తాజాగా ఓ మహిళ రీల్స్ కోసం రోడ్డుపైకి వెళ్లి డ్యాన్స్ చేసింది. అంతే చైన్ స్నాచర్ చేతికి పని చెప్పింది. ఓ మహిళ రీల్స్ కోసం రోడ్డుపై డ్యాన్సు చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన దొంగ ఆమె మెడలో గొలుసును లాక్కెళ్లాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. 
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌ ఇంద్రాపుర్‌ ప్రాంతానికి చెందిన సుష్మా అనే మహిళ రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్ చేస్తుంటుంది. 
 
ఇలా రోడ్డుపై రీల్స్ చేస్తుండగా.. అదే సమయంలో ఆమె పక్క నుంచి బైక్‌పై వచ్చిన ఓ యువకుడు.. మెడలోని గొలుసు లాక్కొని పరారయ్యాడు. దీంతో షాకైన ఆమె పెద్దగా కేకలు వేసింది. కానీ అతడు అక్కడ నుంచి పారిపోయాడు.
 
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ కోసం పోయి..  బంగారు గొలుసు పోగొట్టుకుందని కామెంట్లు పెడుతున్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.