శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (14:51 IST)

పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టిన భర్త.. ఎందుకో తెలుసా?

ఓ భర్త కట్టుకున్న భార్య వేధింపులను తట్టుకోలేక పోయాడు. దీనిపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఏకంగా పోలీస్ స్టేషన్‌కే నిప్పుపెట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ పట్టణంలోని జామ్‌నగర్‌ రోడ్డు రాజీవ్‌నగర్‌కు చెందిన దేవ్జీ చావ్డ (23)కు ఇటీవల వివాహమైంది. అప్పటి నుంచి అతనికి భార్య రూపంలో వేధింపులు మొదలయ్యాయి. 
 
వాటిని తాళలేక ఆ యువకుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తనను అరెస్ట్‌ చేయాలని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలోనే భజ్‌రంగ్‌ వాడి పోలీస్‌ ఔట్‌పోస్టుపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టాడు. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పోలీస్‌ అధికారి తెలిపారు. 
 
అనంతరం అక్కడే నిలబడి ‘నన్ను అరెస్ట్‌ చేయాలి’ అంటూ నిలబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిప్పును చల్లార్చి అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో అతడిని అరెస్ట్‌ చేసినట్లు గాంధీగ్రామ్‌ సీఐ కుమాన్‌సిన్హ్‌ తెలిపారు.