లగ్జరీ కారు కొనేందుకు ఇంటర్ విద్యార్థి స్వీయ కిడ్నాప్ డ్రామా
హై ఎండ్ (లగ్జరీ) కారు కొనుగోలు చేసేందుకు ఓ ఇంటర్ విద్యార్థి స్వీయ కిడ్నాప్ డ్రామా ఆడాడు. చివరకు తన ప్లాన్ ఫలించకపోగా పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్ కృష్ణా కాలనీలో నివాసం ఉండే సందీప్ కుమార్ అనే విద్యార్థి, గత నెల 29వ తేదీన క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇంతలో ఓ వ్యక్తికి సందీప్ కుమార్ రూ.500 డబ్బులు ఇచ్చి తన సోదరుడు ననీవ్ కుమార్‌కు ఫోను చేయించాడు. "నీ సోదరుడిని కిడ్నాప్ చేశాం.. డబ్బు ఇస్తేగానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ" బెదిరించారు.
ఆ తర్వాత భీవండీ ప్రాంతంలో రెండు రోజులు ఉన్న అతని, తన మోటార్ సైకిల్‌ను సెక్టార్ 5లోని ఓ దేవాలయం వద్ద వదలి వెళ్లాడు. తిరిగి గురుగ్రామ్‌కు రాగా, అప్పటికే అతని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చివుండటంతో, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గుర్తుపట్టి, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు... అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. తాను అపస్మారక స్థితిలో పడిపోయానని చెప్పాడని, అతని మాటలను నమ్మని పోలీసులు, క్రైమ్ స్పాట్‌కు తీసుకెళ్లగా, అక్కడ సందీప్ చెప్పినట్టుగా కిడ్నాప్ జరిగిన ఆనవాళ్లు లభించలేదని తెలిపారు. దీంతో పోలీసులు తమదైనశైలిలో విచారించగా అసలు విషయం వెల్లడించారు. తనకు ఇష్టమైన లగ్జరీ కారు కొనేందుకే ఈ నాటకం ఆడినట్టు వెల్లడించారు. దీంతో పోలీసులు అతన్ని మందలించి వదిలివేశారు.