గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (10:45 IST)

ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ప్యాకెట్ మనీ కింద రూ.3 వేలు...

తాము మళ్లీ అధికారంలోకి వస్తే.. 'ముఖ్యమంత్రి యువనేస్తం' పథకం ఇచ్చే నిరుద్యోగ భృతిని 18 యేళ్లకే ఇచ్చేందుకు.. అది కూడా రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు తన మేనిఫెస్టోలో హామీని పొందుపరుస్తోంది. ఈనెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొంది మళ్లీ అధికారంలోకి వస్తే యువతను ఆదుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా, ఇంటర్ పూర్తి చేసిన వారికి నెలకు ప్యాకెట్ మనీ కింద రూ.3 వేలు చొప్పున అందజేయనున్నారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగం వచ్చేవరకూ సొంత ఖర్చులకు తల్లిదండ్రులపై ఆధారపడే అవసరం యువతకు ఉండదని చంద్రబాబు అన్నారు. 
 
ఒకవైపు నిరుద్యోగ భృతి ఇస్తూనే.. వారు ఉద్యోగం, ఉపాధి సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తే ఇటు యువతకు అవకాశాలు రావడంతో పాటు ఉద్యోగ యంత్రాంగంలో కొత్త రక్తం వస్తుందని భావిస్తున్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇది ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు ఈ మేరకు హామీలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
అలాగే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఓసీలతో సహా విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.14 వేల దాకా ఇస్తున్న పాకెట్‌ మనీని మనీని భారీగా పెంచాలని సీఎం నిర్ణయించారు.