గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (11:18 IST)

భారీ వర్షాలు : వరదలకు 14 మంది మృతి - విమానాశ్రయం మూసివేత

కేరళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా మునిగిపోయాయి. ఈ వర్షాలకు కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. భారీ వర్షాల కారణంగా గురువారం ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు మొత్తం 14 మంది మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురున్నారు. 
 
22 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 315 సహాయక శిబిరాలు ఏర్పాటుచేశారు. సహాయక చర్యల కోసం అదనంగా మరో 13 యూనిట్ల ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆర్మీని కోరారు. వరద బీభత్సంతో వణికిపోతున్న వయనాడ్‌ను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కాగా, వయనాడ్‌లో గురువారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో 40 మంది చిక్కుకుపోయారు. 
 
మరోవైపు, ఈ నెల 14 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇడుక్కి, మలప్పురం, వయనాడ్, కోజికోడ్ జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం సహా 12 జిల్లాలు ఇప్పటికే వరద తాకిడికి గురయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 
 
వరుణుడి ప్రతాపంతో అతలాకుతమవుతున్న కేరళ రాష్ట్రంలో కొచ్చి విమానాశ్రయంపై ఆ ప్రభావం పడింది. విమానాశ్రయం ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరడమేకాక రన్‌ వే పైన కూడా నీరు ప్రవహిస్తుండడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ఈ రోజు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేత కొనసాగుతుందని తెలియజేశారు.
 
కాగా, ప్రస్తుతం రాష్ట్రంలోని కొచ్చితో పాటు వయనాడ్‌, ఇడుక్కి, మలప్పురం, కొజిక్కోడ్‌ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విపత్తు నిర్వహణ విభాగ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని కోరారు.
 
వర్ష సంబంధిత ఘటనల్లో గురువారం వరకు 20 మంది మృతి చెందారు. 13,000 మంది నిరాశ్రయు లయ్యారు. బాధితుల కోసం 60 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గత ఏడాది ఆగస్టులోనూ ఇదే తరహా వరదలు వచ్చాయి. అప్పటి పరిస్థితిని గుర్తు చేసుకుని కేరళ వాసులు ఆందోళన చెందుతున్నారు.