సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (12:58 IST)

కృష్ణానదికి భారీ వరద.. పదేళ్లలో తొలిసారి - సాగర్‌వైపు పరుగులు

ఎగువున విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలానికి చేరుకుంటోంది. ఈ వరద ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిగా నిండే సూచనలున్నాయి.
 
కృష్ణానదికి గత పదేళ్ల తర్వాత తొలిసారిగా భారీ వరద కొనసాగుతోంది. కృష్ణాపై కర్ణాటకలో ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి దశాబ్దం తర్వాత భారీగా వరద నీరు విడుదలవుతోంది. మంగళవారం సాయంత్రం 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. 
 
గతంలో 2009లో కృష్ణా నది చరిత్రలోనే అత్యధికంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 25 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా, నారాయణపూర్ నుంచి 2009 అక్టోబరు 2న 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దిగువన భీమా నది నుంచి, స్థానికంగా లభ్యమైన నీటితో కలిసి జూరాలలోకి 11.14 లక్షల క్యూసెక్కుల వరద అప్పట్లో వచ్చి చేరింది. 
 
గత వారం రోజులుగా ఆలమట్టిలోకి 2 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు వచ్చి చేరడంతో క్రమంగా అది మంగళవారం ఉదయానికి 3.6 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే కిందికి విడుదల చేయగా, నారాయణపూర్‌ నుంచి కూడా 3.6 లక్షల క్యూసెక్కులు వరదను విడిచిపెట్టారు. 
 
అయితే, ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సోమవారం కురిసిన భారీ వర్షాలకు ప్రవాహం మరింత పెరిగింది. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో ఫోన్‌లో మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్.. ఆలమట్టి నుంచి మరింత నీటిని విడుదల చేయాలని కోరారు. దీంతో కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాయచూరు జిల్లా అధికారులతో మాట్లాడి నారాయణపూర్‌ నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాలని ఆదేశించారు. దీనికి తగ్గట్లుగా ప్రాజెక్టు అధికారులు చర్యలు తీసుకుని నీటి విడుదలను పెంచారు. 
 
అటు ఆలమట్టి నుంచి కూడా భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ నుంచి అధిక జలాలను విడుదల చేయడం, దిగువ ఉన్న కృష్ణా ఉపనది భీమాలో కూడా భారీ వరద కొనసాగుతోంది. ఈ నదిపై మహారాష్ట్రలో ఉన్న ఉజ్జయిని డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. భీమా, ఇతర నదుల నుంచి వరద ప్రవాహం కృష్ణాలో కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలోకి 2.82 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. సగటున రోజుకు 23 టీఎంసీలకు పైగా వరద శ్రీశైలంలోకి వస్తోంది. 
 
ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 135 టీఎంసీలకు చేరింది. మరో 80 టీఎంసీలు వస్తే ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. రెండు రోజుల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు నీటి విడుదల ప్రారంభమైంది. సోమవారం 45 వేల క్యూసెక్కులు, మంగళవారం 80 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం నుంచి దిగువకు విడిచిపెట్టారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో శ్రీశైలం నిండుకుండలా మారుతుంది. ఇక, నాగార్జునసాగర్‌ నిండటానికి 186 టీఎంసీలు అవసరం. దీని నీటిమట్టం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 120 టీఎంసీలు మాత్రమే ఉంది.