గురువారం, 17 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2016 (11:23 IST)

ఎంత ప్రాధేయపడినా అత్తను చూడనివ్వలేదు.. 8గంటల పాటు ఎదురుచూశాను: దీపా జయకుమార్

తమిళనాడు సీఎం జయలలిత డిసెంబర్ ఐదో తేదీ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయినప్పటి నుంచి వారసత్వంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.జయలలిత వారసుడిగా అజిత్‌ను ప్రకటించారంటూ వార్తలొచ్చాయి. అయితే అది

తమిళనాడు సీఎం జయలలిత డిసెంబర్ ఐదో తేదీ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయినప్పటి నుంచి వారసత్వంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.జయలలిత వారసుడిగా అజిత్‌ను ప్రకటించారంటూ వార్తలొచ్చాయి. అయితే అది పుకారని తేలిపోయింది. మరి జయలలిత వారసత్వం ఎవరిది? అనే దానిపై చర్చనీయాంశమైంది. ప్రస్తుతం సీన్లోకి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ వచ్చారు. 
 
జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రెండుసార్లు దీప కలిసే ప్రయత్నం చేసింది. కానీ ఆసుపత్రి యాజమాన్యం దీపను అనుమతించలేదు. దీనికి శశికళే కారణమంటూ వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే, శశికళ అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఎన్నికైంది. ఈ నేపథ్యంలో దీప ఓ ఇంటర్వ్యూలో శశికళపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు, జయలలిత చనిపోయిన రోజు ఆమె పార్థివదేహాన్ని చూసేందుకు తాను పోయెస్ గార్డెస్‌కు వెళ్లానని, 8 గంటల పాటు ఎదురుచూశానని దీప తెలిపింది. ఒక్కసారి అత్తను చూడాలని ప్రాధేయపడినా తనను లోపలికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
 
జయలలిత వారసత్వం తమ కుటుంబానిదేనని, ఈ విషయంపై న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధమని దీప ప్రకటించింది. శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై కూడా దీప స్పందించింది. అన్నాడీఎంకే ప్రజల పార్టీ అని.. ఏ ఒక్కరు పార్టీని చెప్పుచేతల్లోకి తీసుకోలేరని తెలిపింది. ఇవాళ శశికళ కావొచ్చు రేపు మరెవరైనా కావొచ్చు. ప్రజల మద్దతుతో గెలిచేంతవరకూ వారు నిజమైన నాయకులు కాలేరని వ్యాఖ్యానించారు.

జయలలిత అంత్యక్రియల్లో మీ సోదరుడు పాల్గొన్నాడు, మీరెందుకు కనిపించలేదని దీపను ప్రశ్నించగా, అతను వెళ్లిన సంగతి తనకు తెలియదని, శశికళతో పాటు అంత్యక్రియల్లో చూడగానే చాలా బాధ కలిగిందని దీప చెప్పింది.