శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (11:43 IST)

అర్థరాత్రి అంత్యక్రియలు : కడచూపుకు నోచుకోని హత్రాస్ అత్యాచార బాధితురాలు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్‌లో ఓ 20 యేళ్ల యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుక కత్తించారు. కామాంధుల చేతుల్లో తీవ్రంగా గాయపడిన ఆ బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. అయితే, ఈమె అంత్యక్రియలను పోలీసులే అర్థరాత్రిపూట నిర్వహించారు. ముఖ్యంగా, మృతురాలిని తల్లిదండ్రులు కూడా చివరి చూపును కూడా పోలీసులు చూడనివ్వలేదు. ఆమె అంత్య‌క్రియ‌ల‌కు కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు అనుమ‌తించ‌లేదు. 
 
నిందితుల‌కు ఉరి శిక్ష విధించాల‌ని బాధితురాలి కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తూ.. పోలీసుల వాహ‌నానికి, అంబులెన్స్‌కు అడ్డుప‌డ్డారు. తామే ఇవాళ ఉద‌యం ఆమె మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని పోలీసుల‌ను కోరామ‌ని మృతురాలి సోద‌రుడు పేర్కొన్నారు. కానీ పోలీసులు కుటుంబ స‌భ్యుల మాట విన‌కుండా రాత్రికి రాత్రే కుటుంబ స‌భ్యులను రానివ్వ‌కుండా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.
 
మృతురాలి కుటుంబ స‌భ్యులు, బంధువుల నివాసాల‌కు తాళం వేయ‌డంతో.. వారు బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అక్క‌డ పోలీసుల‌ను భారీగా మోహ‌రించారు. మొత్తానికి పోలీసుల తీరుపై స్థానికులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. 
 
సెప్టెంబ‌ర్ 14వ తేదీన 20 ఏళ్ల యువ‌తిని పంట పొలాల్లోకి తీసుకెళ్లి.. నాలుక కోసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఢిల్లీలోని స‌ఫ్దార్‌జంగ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెలువెత్తాయి. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ఆయా పార్టీల నాయ‌కులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు.