శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (11:47 IST)

ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు - కలిసి పోటీయనున్న కాంగ్రెస్ - ఎస్పీ

Rahul Gandhi
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగాను, అత్యధిక లోక్‌సభ స్థానాలను కలిగివున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా కూడమి పార్టీల మధ్య సీట్ల పంపిణీపై ఓ అవగాహన కుదిరింది. ఈ రాష్ట్రంలో ఈ కూటమిలోని పార్టీలు కలిసి పోటీ చేయనున్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. దీంతో మిగతా 63 స్థానాలను సమాజ్ వాదీ పార్టీతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలు పంచుకోనున్నాయి. ఈ మేరకు ఇండియా కూటమి బుధవారం ఖరారు చేసింది.
 
సీట్ల పంపిణీ ఖరారైందని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్ అవినాష్ పాండే మీడియా సమావేశంలో వెల్లడించారు. యూపీలో కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేస్తుందని, మిగిలిన 63 స్థానాల్లో కూటమిలోని ఇతర పార్టీలు పోటీ చేస్తాయని సంతోషంగా ప్రకటిస్తున్నామని వ్యాఖ్యానించారు. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చాక సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా స్పందించారు. సామరస్యంగా సీట్లను సర్దుబాటు చేసుకున్న ఇండియా కూటమిలోని ప్రతి ఒక్కరికి అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. 
 
బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రామ్ మనోహర్ లోహియా సూచించిన సంఖ్యా భాగస్వామ్య సూత్రాన్ని అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని అఖిలేశ్ యాదవ్ అన్నారు. సమానత్వం కోసం సోషలిస్టు విలువలను క్రియాశీలకం చేస్తామన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించినట్టు మీడియా సమాచారం. రాహుల్ గాంధీతో సంప్రదిస్తూ అఖిలేశ్ యాదవ్‌తో చర్చలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
 
తొలుత అదనంగా మొరాదాబాద్ ఎంపీ సీటు కూడా తమకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే, చివరికి పరిస్థితులను అర్థం చేసుకుని, ఆ సీటు కోసం అంతగా పట్టుబట్టకుండా 17 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో రాష్ట్రంలో ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. రాయబరేలి, అమేథి, కాన్పూర్ నగర్, ఫతేపూర్ సిక్రీ, బాన్స్ గావ్, సహరాన్ పూర్, ప్రయాగ్ రాజ్, మహారాజ్ గంజ్, వారణాసి, అమ్రోహ, ఝాన్సీ, బులంద్ షెహర్, ఘజియాబాద్, మధుర, సీతాపూర్, బారాబంకీ, డియోరియా సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయనుంది.