జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది. ఇంతకుముందు ఆ స్థానంలో వున్న జపాన్ దేశాన్ని అధిగమించి 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ముందుకు సాగుతోంది. భారత్ ముందు ఇంక 3 దేశాలు మాత్రమే వున్నాయి. అమెరికా, చైనా, జర్మనీలు వరుసగా 1, 2, 3 స్థానాల్లో వున్నాయి. రానున్న మూడేళ్లలో జర్మనీ స్థానాన్ని భారతదేశం అధిగమిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం మనందరికీ గర్వకారణం. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా ప్రకారం 2028 నాటికి జర్మనీని అధిగమించి 3వ స్థానంలో భారతదేశం నిలుస్తుంది. ఇది ప్రతి భారతీయుడు కృషికి నిదర్శనం. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు సాగాలి అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్వట్టర్ ద్వారా తెలియజేస్తూ... వికసిత్ భారత్ 2047 దిశగా అడుగు పడింది. 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వం, ఎన్డీయే ప్రగతిశీల పాలన వల్ల ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైంది అని పేర్కొన్నారు.