గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (14:27 IST)

ఆకలితో చస్తుంటే.. రూ.వెయ్యి కోట్లతో పార్లమెంట్ భవనం అవసరమా?

కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించనుంది. ఇందుకోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనుంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు, కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. లాక్డౌన్ అన్‌లాక్ తర్వాత ఇపుడిపుడే కుదుటపడుతున్నాయి. లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉపాధి లేక తల్లడిల్లిపోతున్నారు. ఉపాధి కల్పోయిన అనేక కుటుంబాలు జీవనం సాగించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో రూ.వెయ్యి కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించనుంది. ఇందుకోసం ఈ నెల పదో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ కూడా చేశారు. సెంట్రల్ విస్టా పేరుతో కేంద్రం నూతన పార్లమెంటు సముదాయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనిపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు.  
 
కరోనా దెబ్బకు దేశంలో సగం మంది ఉపాధి కోల్పోయి ఆకలితో అల్లాడుతుంటే, ఎవరైనా రూ.1000 కోట్లతో పార్లమెంటు భవనం కడతారా? అంటూ మండిపడ్డారు. చైనాలో గ్రేట్ వాల్ నిర్మాణ సమయంలో వేలమంది ప్రజలు చనిపోయారని, అయితే ఆ గోడ నిర్మిస్తోంది ప్రజలను రక్షించడానికేనని అప్పటి రాజులు చెప్పారని కమల్ ప్రస్తావించారు. ఇప్పటి భారత పాలకుల తీరు కూడా అలాగే ఉందని విమర్శించారు.