గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (19:52 IST)

బామ్మకు భర్త దొరికాడోచ్... వరుడు కావలెను ప్రకటనకు స్పందన!

తనకు వరుడు కావలెను అంటూ 73 యేళ్ల భామ ఇచ్చిన ఓ ప్రకటనకు మంచి స్పందనే వచ్చింది. ఈ భామను పెళ్లి చేసుకునేందుకు 69 యేళ్ల తాత ఒకరు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ భామకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత వారిద్దరూ ఫోనులోనే మనస్సు విప్పి మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ త్వరలోనే ఓ ఇంటివారు కానున్నారు. అదీకూడా వారివారి పిల్లల స‌మ‌క్షంలో కొత్త దంపతులు కానున్నారు. క‌ర్ణాట‌క‌లోని మైసూరు నగరంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఓ ఉపాధ్యాయురాలు త‌న భ‌ర్త‌తో విభేదాలు రావ‌డంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. జీవితంలో ఆమెకు ఓ తోడు అవసరమని ఆమె కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రిపారు. వయసులో ఉన్నపుడు ఆమె మరో పెళ్లికి అంగీకరించలేదు. 
 
కానీ, 73 యేళ్ల వయసులో తనకూ ఓ తోడు కావాలని గ్రహించిన ఆమె... వరుడు కావలెను అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనకు 69 ఏళ్ల విశ్రాంత ఇంజనీర్‌ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. త‌న భార్య ఏడేళ్ల క్రిత‌మే మృతి చెందింద‌ని ఆయన చెప్పారు. ఇరు కుటుంబాల్లో వారి పిల్ల‌లు ఈ పెళ్లికి ఒప్పుకోవ‌డంతో త్వరలోనే బామ్మగారి మెడలో తాతగారు మూడుముళ్లూ వేయడానికి కొత్తపెళ్లికొడుకులా రెడీ అయిపోతున్నారు.