మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి

కేరళ బంగారం స్కామ్.. హైదరాబాదు నుంచే.. కోట్లు వెళ్లాయా?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ బంగారం స్కామ్ రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. జూన్ 6వ తేదీన దుబాయ్‌ నుంచి చార్టర్డ్‌ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్‌ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. దౌత్య మార్గంలో తరలిన రూ.15 కోట్ల విలువైన బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. 
 
తాజాగా ఈ కేసుకు హైదరాబాదుతో లింకులు వున్నట్లు తెలిసింది. ఈ కేసులో అత్యంత కీలకమైన నగదు చెల్లింపులు హైదరాబాద్‌ నుంచే జరిగాయని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. రూ. కోట్లాది విలువ చేసే బంగారం కొనేందుకు నిందితులు అడ్డదారుల్లో హవాలా మార్గాల్లో చెల్లిస్తారన్న సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో రూ. కోట్లు హైదరాబాద్‌ నుంచి హవాలా రూపంలో దుబాయ్‌కి చెల్లింపులు చేశారన్న సమాచారంపై కస్టమ్స్‌ శాఖ కూడా కూపీ లాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ను అరెస్ట్‌ చేసింది.
 
కాగా గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం కేరళలో పెను ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను తొలగించారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడిన వెంటనే శివకంర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే.