శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (09:42 IST)

జయలలిత వైద్యం కోసం మళ్లీ ఎయిమ్స్ - లండన్ వైద్యులు.. అమ్మకోసం కార్యకర్తల ఆత్మహత్య

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన చికిత్స అందించేందుకు లండన్ నుంచి వైద్యుల బృందం మళ్లీ చెన్నై చేరుకుంది. అనారోగ్యానికి గురైన జయలలిత గత నెల 22 నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసి

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన చికిత్స అందించేందుకు లండన్ నుంచి వైద్యుల బృందం మళ్లీ చెన్నై చేరుకుంది. అనారోగ్యానికి గురైన జయలలిత గత నెల 22 నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, సెప్టెంబర్ నెలాఖరులో ఒకసారి, ఈనెల 4న మరోసారి లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే చెన్నైకి వచ్చి జయకు చికిత్స చేసి వెళ్లారు. జయలలిత మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని అపోలో వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే బృందం ఐదు రోజుల పాటు చెన్నైలోనే ఉండి జయకు వైద్య సేవలు అందించనున్నారు. 
 
గతంలో జయ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను తట్టుకోలేక ఇప్పటికే ఓ కార్యకర్త గుండెపోటుతో మరణించగా, మరో పార్టీ నేత ఒకరు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే. మరో వైపు... జయ ఆరోగ్యం రోజురోజుకు వదంతులు వస్తున్న నేపథ్యంలో ''అమ్మ'' అభిమానులు ఇద్దరు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. అన్నాడీఎంకే కార్యకర్త సర్గుణం(31) బుధవారం రాత్రి నడిరోడ్డుపైనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడగా మధురై జిల్లా ఉత్తపురానికి చెందిన రాజవేల్(21) ఈ నెల 4న ఒంటికి నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన రాజవేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి మృతి చెందాడు. కాగా, సీఎం జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టించిన మరో ఇద్దరిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 48 మంది కోసం గాలిస్తున్నారు.