మహారాష్ట్రలో 50 అడుగుల వంతెనపై నుంచి పడ్డ మినీ బస్సు: ఐదుగురి మృతి
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె-బెంగళూరు హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. 50 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి ఓ మినీ బస్సు పడడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని పోలీసులు వివరించారు.
ఆ బస్సు ముంబై నుంచి గోవా వెళుతోన్న సమయంలో పూణె-బెంగళూరు హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. వంతెనపై నుంచి వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు దూసుకుపోయి కింద పడిపోయిందని వివరించారు.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయాలపాలైన వారిని సహాయక బృందాల వారు ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.