బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:54 IST)

ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజులే పనిదినాలు.. ఎక్కడ?

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోమారు భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ చేస్తున్న విలయంతాండవం దెబ్బకు ప్రతి ఒక్కరూ బెంబేలెత్తిపోతున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. ఇందులోభాగంగా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనుంది. అలాగే, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఐదు రోజులే ప‌ని దినాలు ఉంటాయ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంవో స్ప‌ష్టం చేసింది. 
 
ఈ నిబంధ‌న‌లు నేటి నుంచి మూడు నెల‌ల పాటు అమ‌ల్లో ఉంటాయ‌ని పేర్కొంది. ఇక ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేయ‌బ‌డుతుంద‌ని తెలిపింది. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. 
 
ప్ర‌తి ఆదివారం పూర్తి స్థాయి లాక్డౌన్ అమ‌ల్లో ఉంటుంది. చింద్వారా జిల్లాలో క‌రోనా కేసుల తీవ్ర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో వారం రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు సీఎంవో వ‌ర్గాలు తెలిపాయి.
 
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బుధ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 4,043 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,18,014కు చేరింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 26,059గా ఉంది. 
 
మరోమారు లాక్డౌన్.. 
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. రోజుకు లక్ష మందికిపైగా ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలను తీసుకున్నాయి. ఇప్పటికే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో తాత్కాలిక లాక్డౌన్‌ను అమలు చేస్తున్నాయి. 
 
ఇపుడు ఇదే కోవలో తాజాగా ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో 11 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్‌ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ లాక్డౌన్ ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 19 వరకు అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
కాగా, ఛత్తీస్‌గడ్‌లో మంగళవారం 9,921 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధికంగా రాయ్‌పూర్‌లోనే వెలుగుచూశాయి. దీనితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ వైద్య అధికారులతో సుదీర్ఘ చర్చ జరిగి రాజధానిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఏప్రిల్ 14వ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోవుంది.