హస్తినలో చంద్రబాబుకు మర్యాద అంతేనా : బాబు లేఖకు 14 నెలల తర్వాత నితిన్ గడ్కరీ ప్రత్యుత్తరం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఏమాత్రం మర్యాద ఇవ్వడం లేదనే విషయం ఓ లేఖ ద్వారా తేటతెల్లమైంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లినపుడల్లా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు దర్శనం చేసుకుని రావడం ఆనవాయితీగా మారింది. కానీ, ఆ కేంద్రమంత్రులు మాత్రం చంద్రబాబు గడ్డిపోచతో సమానంగా చూస్తున్నట్టు ఈ లేఖ ద్వారా తేలిపోయింది.
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం రాసే లేఖకు కేంద్రం తక్షణం స్పందించాల్సి ఉంటుంది. కానీ, కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మాత్రం 14 నెలల సమయం తీసుకుంది. గత 2015 జనవరి 16వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు ఓ లేఖ రాశారు. దానికి సదరు మంత్రివర్యులు 2016 మార్చి 22న సమాధానం రాశారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లేఖకు సమాధానమివ్వడానికి ఖచ్చితంగా 14 నెలల ఆరు రోజులు పట్టిందన్న మాట.
దేశంలోని వివిధ పోర్టుల మధ్య సరుకురవాణా కోసం దేశీయ షిప్పులనే వాడేలా 'కేబొటేజ్' చట్టం ఆంక్షలను నిర్దేశించింది. దేశీయ షిప్పులు అందుబాటులో లేనప్పుడు మాత్రమే మేరిటైమ్ రెగ్యులేటర్ నుంచి ముందస్తు అనుమతితో విదేశీ షిప్పులు వినియోగించాల్సి ఉంటుంది. అయితే, దేశీయ షిప్పింగ్ వెస్సల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల సరుకు రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీనిపై చంద్రబాబు 2015 జనవరిలో కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు. ఆ తర్వాత కేబొటేజ్ ఆంక్షలను పాక్షికంగా సడలించారు. పనైతే జరిగింది. కానీ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. సీఎం చంద్రబాబుకి ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాత్రం ఏడాది పైనే సమయం పట్టింది. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబుకు నితిన్ గడ్కరీ ఏ విధంగా మర్యాద ఇచ్చారో ఇట్టే అర్థమైంది.