శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (09:43 IST)

పళనిస్వామిని గద్దెదించేవరకు నిద్రపోను.. పన్నీర్ సెల్వం కఠిన నిర్ణయం

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న శశికళ బినామీ ఎడప్పాడి కె. పళనిస్వామిని గద్దె దించేంతవరకు నిద్రపోనని, విశ్రమించబోనని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలక

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న శశికళ బినామీ ఎడప్పాడి కె. పళనిస్వామిని గద్దె దించేంతవరకు నిద్రపోనని, విశ్రమించబోనని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. జయలలిత సమాధి సాక్షిగా ఆమె సన్నిహితురాలు శశికళ నాయకత్వంలోని అన్నాడీఎంకే అధిష్టానంపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం బలసమీకరణలోనూ విఫలమయ్యారు. 
 
తాను కాకుండా మరో 10 మంది శాసనసభ్యుల నుంచి మాత్రమే మద్దతును పొందగలిగారు. ఈ నేపథ్యంలో అక్రమ పద్ధతులతో ప్రతిపక్షాలేవీ లేని స్థితిలో శాసనసభలో జరిగిన బలపరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి పళనిస్వామిని గద్దె దించే దిశగా రాష్ట్రంలో మళ్లీ అమ్మ పాలన వచ్చేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్టు పన్నీర్‌సెల్వం ప్రకటించారు.
 
తొట్టతొలుత అన్నాడీఎంకే గెలిచిన 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఆ మేరకు పర్యటన పథకాలను రూపొందించే నిమిత్తం పన్నీర్‌సెల్వం నివాస గృహంలో పార్టీ సీనియర్లు మధుసూదనన్, పొన్నయ్యన్, కేపీ మునుసామి, నత్తం విశ్వనాథన్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తలను కూడగట్టుకునేందుకు పన్నీర్‌సెల్వం అభిమానుల సంఘం (పేరవై) పేరుతో ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని నాయకులు సూచించారు.
 
పార్టీని శశికళ వర్గం ఎలా స్వాధీనం చేసుకున్నదీ, అధికారం కోసం జరిపిన అక్రమాలను గురించి ప్రజలకు వివరించే రీతిలో ఈ పర్యటన నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులోభాగంగా, అక్కడక్కడా ర్యాలీలు, బహిరంగ సభలు జరపాలని నాయకులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఎడప్పాడికి మద్దతు ప్రకటించిన 122 మంది అన్నాడీఎంకే శాసనసభ్యుల నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ర్యాలీలు జరపాలని నాయకులు సూచించారు. 
 
ప్రస్తుతం జయలలిత నియోజకవర్గమైన ఆర్కేనగర్‌ నుంచి పర్యటనను ప్రారంభించాలా? లేక చెన్నై నుంచే ప్రారంభించాలా? అనే విషయంపై వారు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పర్యటనలో జయలలిత మేనకోడలు జయ దీపాను కూడా తమ వెంట తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రచార రథాన్ని కూడా పన్నీర్ సెల్వం వర్గం సిద్ధం చేసింది.