దినకరన్ అరెస్టుతో దిమ్మతిరిగింది. ఉన్నఫళాన శశికళ బ్యానర్ల తొలగింపు. మళ్లీ అమ్మకు అందలం
దేవుడికైనా దెబ్బే గురువు అనే సామెత ఊరికే పుట్టలేదు మరి. కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా మౌనం పాటించడంతో చర్చల ప్రక్రియకే ఎగనామం పెట్టడానికి వ్యూహం పన్నిన పళనిస్వామి బృందానికి ఢిల్లీ పోలీసులు మంగళవారం అర్థరాత్రి శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్‌ను ఉన్నట్ల
దేవుడికైనా దెబ్బే గురువు అనే సామెత ఊరికే పుట్టలేదు మరి. కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా మౌనం పాటించడంతో చర్చల ప్రక్రియకే ఎగనామం పెట్టడానికి వ్యూహం పన్నిన పళనిస్వామి బృందానికి ఢిల్లీ పోలీసులు మంగళవారం అర్థరాత్రి శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్‌ను ఉన్నట్లుండి అరెస్టు చేయడంతో పక్కలో బాంబు పడినట్లు అదిరిపడ్డారు. దాంతో బుధవారం ఉదయం అఘమేగాల మీద రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ఉన్న చిన్నమ్మ బ్యానర్లన్నీ తొలగించారు. వాటి స్థానంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బ్యానర్లు పెట్టారు. అంతే కాకుండా ఆగిపోయాయనుకున్న చర్చలకు జీవం పోస్తూ పళనిస్వామి వర్గం హడావుడి సృష్టించింది. మరోవైపు అన్ని కలిసి వస్తున్నాయని, సమయానుకూలంగా చర్చలకు వెళ్తామని పన్నీరు శిబిరం ప్రకటించడంతో ఎదురుచూపులు పెరిగాయి.
పన్నీరు శిబిరం నుంచి మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళనిస్వామి శిబిరానికి చెందిన ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల మేరకు ఆ హోటల్లో చర్చలు సాగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈసందర్భంగా తమ వైపు ఉన్న వాదనలు, డిమాండ్లను పళనిస్వామి శిబిరానికి తెలియజేసినట్టు సమాచారం. అదే రాత్రి పార్టీ బహిష్కృత ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్ అరెస్టుతో ఉదయాన్నే పళని స్వామి శిబిరం దూకుడు పెంచడం గమనార్హం.
మంగళవారం కొందరు జిల్లాల కార్యదర్శులు చెన్నైకు చేరుకున్నా, బుధవారం మరి కొందరు రావడంతో మొత్తంగా 31 జిల్లాల కార్యదర్శుల వద్ద సంతకాల సేకరణ సాగడం ఆలోచించదగ్గ విషయం. పార్టీకి పెద్ద దిక్కుగా ప్రస్తుతం సీఎం పళనిస్వామికే బాధ్యతల్ని అప్పగించే అంశాలు ఆ సంతకాలు చేసిన పత్రాల్లో ఉన్నట్టు సమాచారం.
పన్నీరు, పళని శిబిరాలు ఏకమయ్యే విధంగా వారం పది రోజులుగా రాష్ట్రంలో చర్చ సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే.
అయితే, ఇరు శిబిరాల మధ్య పేలుతూ వచ్చిన మాటల తూటాలు, తెర మీదకు వచ్చిన కీలక డిమాండ్ల పర్వాలు వెరసి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా విలీన వ్యవహారం మారింది. చర్చలకు తేదీ నిర్ణయించినా, చివరకు రెండు శిబిరాల ఒకే వేదిక మీదకు రాలేదు. దీంతో చర్చలు ఆగినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది.