శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (13:54 IST)

'తమిళ దళపతి'కి జనసేనాని అభినందనలు

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌కు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా, సీఎం స్టాలిన్ పాలనపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మాటలే కాదు.. చేతల్లోనూ పాలన ఎలా ఉండాలో చూపిస్తున్నారని మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
ఇందులో... 'ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనేకాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నారు. మీ పాలన, పనితీరు తమిళనాడు ఒక్క దానికే కాదు.. దేశంలోని మిగతా రాష్ట్రాలకూ, రాజకీయ పార్టీలకూ ఆదర్శం, మార్గదర్శి. అంత మంచి పాలన అందిస్తున్న మీకు మనస్ఫూర్తిగా అభినందనలు' అంటూ స్టాలిన్‌ను ప్రశంసించారు.
 
ఇదిలావుంటే, గత ఏప్రిల్ నెలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే నెలలో వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన డీఎంకే ఏకంగా 151 సీట్లను కైవసం చేసుకుంది. ఒక్క డీఎంకేనే 133 స్థానాల్లో విజయం సాధించింది.