శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (12:20 IST)

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Modi
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభానికి ముందు విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముప్పేట దాడి చేశారు. ప్రజలు పదేపదే తిరస్కరించినవారు పార్లమెంట్‌ను, ప్రజాస్వామ్యాన్ని అగౌరపరుస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు చేతికింద మనుషులను పెట్టుకని గూండాయిజం ద్వారా పార్లమెంట్‌ను నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి చర్యలన్నింటినీ దేశ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, సమయం వచ్చినప్పడు వారిని మళ్లీ ప్రజలు శిక్షిస్తారని అన్నారు. పార్లమెంట్ సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
మరోవైపు, ఈ పార్లమెంట్ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. అయితే, మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని కొందరు సభ్యులు కోరినట్లు తెలిసింది. అలాగే కేంద్రం మరికొన్ని బిల్లులను ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపుతో జోష్‌లోవున్న ఎన్డీయే జమిలి ఎన్నికలపైనా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 
 
అయితే, ఈ సమావేశాల్లోనే ఆ బిల్లు పెడతారా? లేదా తదుపరి సమావేశాల వరకు నిరీక్షిస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అఖిలపక్ష సమావేశానికి 30 రాజకీయ పార్టీలకు చెందిన 42 మంది నేతలు హాజరయ్యారు. డిసెంబరు 20వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబరు 26న పార్లమెంటు సమావేశాలు జరగవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ రోజున పాత పార్లమెంట్ భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 15వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.