సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (11:25 IST)

టిక్ టాక్ వీడియో.. అలా ప్రాణం తీసింది..

సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఇంకా టిక్ టాక్ వంటి యాప్‌ల ద్వారా పాపులర్ అయ్యేందుకు చాలామంది డబ్ స్మాష్‌లతో వీడియోలను పోస్టు చేస్తూ వుంటారు. అయితే టిక్ టాక్‌లో ఇలా పోస్టు చేసిన ఓ వీడియో ఓ ప్రాణాన్ని బలిగొంది. ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్‌కి ఓ యువకుడు వెళ్లాడు. అయితే చిట్టీ డబ్బులతో కనిపించకుండా పోయాడంటూ స్నేహితుల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
ఇలా వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌లో తనపై తప్పుడు వీడియో వైరల్ కావడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్‌లో ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడుకు చెందిన పుచ్చకాయల మోహన్‌కుమార్ (30) రెండేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ ఓ దుకాణంలో పనికి కుదిరాడు. సంపాదించిన సొమ్ములో కొంత చిట్టీ కడుతున్నాడు. ఇటీవల ఆ చిట్టీని పాడుకున్నాడు.
 
అయితే, చిట్టీ పాడుకున్న మోహన్ ఆ డబ్బు తీసుకుని కనిపించకుండా పోయాడంటూ అతడి స్నేహితులు కొందరు మోహన్ ఫొటోలతో ఓ వీడియో తయారుచేసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశారు. అది చూసి తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్ ఈ నెల 3న తాను ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.