శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (22:15 IST)

శశికళకు మరో షాక్... పన్నీర్ సెల్వం గూటికి మరో ఎంపీ... పెరుగుతున్న వలసలు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకేకు చెందిన తిరువణ్ణామలై లోక్‌సభ సభ్యురాలు ఆర్.వానరోజా శనివారం రాత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు జై కొట్టారు. స్థ

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకేకు చెందిన తిరువణ్ణామలై లోక్‌సభ సభ్యురాలు ఆర్.వానరోజా శనివారం రాత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు జై కొట్టారు. స్థానిక గ్రీన్‌వేస్ రోడ్డులో ఉన్న సీఎం అధికారిక నివాసంలో శనివారం రాత్రి కలుసుకుని ఆయనకు మద్దతు ప్రకటించారు. దీంతో పన్నీర్ పంచన చేసి అన్నాడీఎంకే లోక్‌సభ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరగా, ఒక రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ ఉన్నారు. 
 
మరోవైపు... శనివారం మరో ఇద్దరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. వీరిలో ఒకరు మంత్రి కాగా, మరొకరు చెన్నై మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ ఆర్.నటరాజన్ ఉన్నారు. అలాగే, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, ఎమ్మెల్యే, నటుడు ఆర్.శరత్ కుమార్ కూడా పన్నీర్‌కు అండగా నిలించారు. 
 
అలాగే, పార్టీ కోశాధికారిగా కొత్తగా శశికళ నియమించిన దిండిగల్ శ్రీనివాసన్‌ కూడా పన్నీర్‌కు జైకొట్టినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే కోశాధికారిగా ఉన్న పన్నీర్ సెల్వంను ఆ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో దిండిగల్ శ్రీనివాసన్‌ను నిమించారు. అయితే శ్రీనివాసన్ ఇవాళ సెల్వంకు మద్దతు ప్రకటించి శశికళకు పెద్ద ఝలక్ ఇచ్చాడు.
 
మరోవైపు ఆలస్యమవుతున్నా కొద్దీ ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుండడంతో శశికళ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకునే పనిలో పడ్డారు. వీలైనంత త్వరగా ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్ ముందు పరేడ్ నిర్వహించాలని శశికళ భావించాలని ప్రయత్నించినప్పటికీ ఆ వ్యూహం కూడా ఫలించలేదు.