బీజేపీ అభ్యర్థిని కాలితో తన్ని... పరుగెత్తించి కొట్టిన టీఎంసీ క్యాడర్ (Video)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిని కాలితో తన్ని చెట్ల పొదల్లోకి తోసివేశారు. ఆ తర్వాత ఆయన తేరుకుని రోడ్డుపైకి వచ్చారు. దీంతో ఆయన వెంబడించి పరుగెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఖరగ్‌పూర్ సదర్, కలియాగంజ్, కరీంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జయప్రకాశ్ మజుందార్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
ఈ ఘటన జియాఘాట్ ఇస్లాంపూర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన జయప్రకాశ్‌పై తృణమూల్ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. పోలింగ్ కేంద్రం బయట.. జయప్రకాశ్‌ను కాళ్లతో తన్నుతూ.. చెట్లలోకి తోసేశారు టీఎంసీ కార్యకర్తలు. దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటన జరిగిన పోలింగ్ కేంద్రం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, ఖరగ్‌పూర్ సదర్, కలియాగంజ్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దిలీప్ ఘోష్, మహువా మోయిత్రా లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఈ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక కరీంపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ప్రమథనాథ్ రాయ్ ఈ ఏడాది మే 31న మరణించారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.