సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (15:52 IST)

స్టాలిన్‌కు పన్నీర్ వార్నింగ్.. తండ్రి బుద్ధులు పోలేదంటూ మండిపాటు

నిన్నామొన్నటివరకు తనకు అండగా నిలిచిన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు అసెంబ్లీ విపక్ష నేత ఎంకే స్టాలిన్‌కు అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం బహిరంగ వార్నింగ్ ఇచ్చారు.

నిన్నామొన్నటివరకు తనకు అండగా నిలిచిన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు అసెంబ్లీ విపక్ష నేత ఎంకే స్టాలిన్‌కు అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం బహిరంగ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఫోటోలను తొలగించాలని ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. 
 
ప్రభుత్వ కార్యాలయాల్లో దివంగత జయలలిత ఫొటోలను తొలగించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ను స్టాలిన్ కలిసి ఓ వినతి పత్రం సమర్పించిన విషయం తెల్సిందే. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే కోర్టుకెళతామంటూ ప్రకటించారు. దీనిపై పన్నీర్ సెల్వం ఆదివారం స్పందించారు. డీఎంకే డిమాండ్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని మండిపడ్డారు. నిరంతరం పేదల సంక్షేమం కోసం పాటుపడిన ‘అమ్మ’ ఫొటోలను తొలగిస్తే ప్రజావ్యతిరేక తప్పదని హెచ్చరించారు. 
 
ప్రభుత్వ కార్యాలయాల్లో నుంచి జయలలిత ఫొటోలను తొలగించినా ప్రజల మనసుల్లోంచి ‘అమ్మ’ను తొలగించలేరని అన్నారు. ప్రజలు వరుసగా రెండుసార్లు తిరస్కరించినా డీఎంకేకు బుద్ధిరాలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. తండ్రి కరుణానిధి బాటలోనే స్టాలిన్ కూడా నడుస్తున్నారంటూ పన్నీర్ సెల్వం ధ్వజమెత్తారు.