గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (11:29 IST)

ప్రభుత్వం అహం గాయపడిందన్న నెపంతో దేశ ద్రోహం కేసు పెడతారా?

టూల్‌కిట్‌ కేసులో యువ పర్యావరణ కార్యకర్త దిశ రవికి ఢిల్లీలోని పటియాల హౌస్‌లోని ఓ కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు, అటు ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. ముఖ్యంగా, దిశా రవిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. 

ఈ కేసులో పటియాల కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పోలీసుల తీరును, పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. 'ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రభుత్వ మనస్సాక్షిని, ధర్మాన్ని పరిరక్షించేది పౌరులే. కేవలం తాము చేసే విధానాలను, చట్టాలను వ్యతిరేకించారన్న కారణంతో ప్రభుత్వాలు పౌరులను కటకటాల్లోకి తోయడం సమ్మతం కాదు. ప్రభుత్వాల అహం, అభిమానం గాయపడిందన్న నెపంతో దేశద్రోహం కేసును నమోదుచేయరాదని గుర్తుచేశారు.

అలాగే, అసమ్మతి వ్యక్తీకరణ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. 19వ అధికరణం కింద స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించే ఈ హక్కు. అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులు, సంస్థలు వాటిని వినడాన్ని కూడా కల్పిస్తుంది. భేదాభిప్రాయాలు, అసమ్మతి, విభేదం, విరోధం ఇవన్నీ ప్రభుత్వ విధానాలపై నిష్పాక్షిక దృక్పథం కలిగించే ఉపకరణాలు. చైతన్యవంతంగా, నిర్భీతిగా మనోభావాలు వెల్లడించే పౌరసమాజం ఉండటం ఓ సజీవమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి చిహ్నం అని ధర్మేంద్ర రాణా వ్యాఖ్యానించారు. 

'మనది 5000 సంవత్సరాల నాగరికత. సదాశయాలు, సమున్నతమైన ఆలోచనలు అన్ని దిశల నుంచీ రావాలని రుగ్వేదం చెబుతోంది. ప్రాచీన నాగరికత విభిన్న ఆలోచనలను, అభిప్రాయభేదాలను స్వాగతించింది. గౌరవించింది. మన సాంస్కృతిక వారసత్వం విభిన్నతకు ప్రతిబింభం అని జడ్జి రాణా వ్యాఖ్యానించారు.