శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (16:45 IST)

ఏపీ రాజధానిగా విశాఖపట్టణం : కేంద్రం డాక్యుమెంట్

ఏపీ రాజకీయాల్లో కేంద్రం కొత్త అలజడి సృష్టించింది. ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొంటూ కేంద్రం సరికొత్త డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసింది. ఇది ఏపీ రాజకీయాల్లో సరికొత్త సునామీ సృష్టించేలా వుంది. 
 
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా, విశాఖ, కర్నూలు, అమరావతిని రాజధానులుగా ప్రకటించారు.
 
ఈ నపథ్యంలో ఏపీ రాజధాని అంశానికి సంబంధించి తాజాగా కొత్త అలజడి రేగింది. ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాగున్నాయంటూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వశాఖ రాతపూర్వక వివరణ ఇచ్చింది. 
 
కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణలో ఏపీ రాజధానిగా వైజాగ్‌ను పేర్కొంది. కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వశాఖ పేరుతో విడుదలైన ఈ డాక్యుమెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కేపిటిల్‌గా వైజాగ్‌ను చూపడంతో కేంద్రం అధికారికంగా గుర్తించిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వైజాగ్‌ను చూపెడుతూ కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వశాఖ విడుదల చేసిన డాక్యుమెంట్‌పై వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని వైజాగేనన్న దానిపై మాకు గాని, మా ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని ఎలాంటి అనుమానం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.