ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (13:22 IST)

ప్రధాని నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సునామీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సునామీ సృష్టించింది. మొత్తం 403 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ ఏకంగా 310 సీట్లను కైవసం చేసుకునే దిశగా సాగుతోంది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సునామీ సృష్టించింది. మొత్తం 403 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ ఏకంగా 310 సీట్లను కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. దీంతో 15 యేళ్ల తర్వాత బీజేపీ ఇక్కడ అధికారంలోకి రానుంది. 
 
పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా యూపీపై దృష్టి సారించి ప్రణాళికపరంగా అడుగులు వేయడంతో కీలకమైన రాష్ట్రంలో విజయ దుందుభి మోగించేందుకు రంగం సిద్ధం చేశారు. గత 2012 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 47 స్థానాలకే పరిమితమైన బీజేపీ... 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో భాజపా కూటమి 73 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో యూపీపై భాజపా అంచనాలు పెరిగాయి. 
 
జనాభారీత్యా పెద్ద రాష్ట్రం కావడంతో పాటు ఎక్కువ అసెంబ్లీ స్థానాలు, ఎంపీలు ఉండటంతో దేశ రాజకీయాల్లో యూపీకి విశేష ప్రాధాన్యం ఉంది. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాలు అవధ్‌, పూర్వాంచల్‌, బుందేల్‌ఖండ్‌, రోహిల్‌ఖండ్‌, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో భాజపా భారీ ఆధిక్యంతో సునామీ సృష్టించింది. భాజపాకు కుల, మతాలకు అతీతంగా ఓటర్లు మద్దతు పలికారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు ఓటర్లు భారీగా స్పందించి, కాషాయానికి పట్టంకట్టారు. 1989 నుంచి రాష్ట్రంలో భాజపా పెద్ద పార్టీగా ఉన్నా అనంతరం ఏర్పడిన రాజకీయపరిణామాలతో గణనీయ విజయాలను సాధించలేకపోయింది. 
 
రాష్ట్రంలో అధికారం ఎస్పీ లేదా బీఎస్పీల మధ్యనే కేంద్రీకృతమైంది. 2014లో కేంద్రంలో అధికారంలో చేపట్టిన అనంతరం భాజపా యూపీపై ప్రత్యేకమైన దృష్టిపెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం యూపీలో ఉండటం విశేషం.