1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (20:37 IST)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. రాహుల్, ప్రియాంకా గాంధీల హర్షం

Rahul Gandhi Jodo Yatra
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే సమయంలో "కర్ణాటక కాంగ్రెస్ కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులందరికీ" అభినందనలు తెలిపారు.
 
"కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినందుకు కర్ణాటక ప్రజలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇది మీ సమస్యలపై విజయం" అని ప్రియాంక గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు. కర్ణాటక ప్రగతికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే దేశాన్ని ఏకం చేసే రాజకీయాలకు ఇది విజయం' అని ఆమె పేర్కొన్నారు.
 
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు తమ పార్టీ కట్టుబడి వుందని ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పార్టీ పూర్తి అంకితభావంతో పని చేస్తుందని హామీ ఇచ్చారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 136 సీట్లు గెలుచుకుని ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ సాధించింది. బీజేపీ 64 నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
 
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కర్ణాటక ఎన్నికలపై స్పందించారు. ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టపడి పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందించారు. 
 
"కర్ణాటకలో కాంగ్రెస్ పేద ప్రజలవైపు నిలబడింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే...ఈసారి మేం ద్వేషంతో పోటీ చేయలేదు. ప్రేమతోనే పోటీ చేశాం. దేశ ప్రజలంతా ప్రేమ పూరిత రాజకీయాలనే కోరుకుంటున్నారని కర్ణాటక ప్రజలు నిరూపించారు. విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలికారు. ప్రేమపూర్వక రాజకీయాలకే ఓటు వేశారు. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చుతాం. మొదటి రోజు నుంచే ఈ పని మొదలు పెడతాం" అంటూ ట్వీట్ చేశారు.