స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలు... స్కూల్‌లో మద్యం సేవించిన బాలికలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన భట్‌చారా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తన స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని పలువురు విద్యార్థినులు మద్యం సేవించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోలో అమ్మాయిలు తరగతి గదిలో కూర్చొని బీరు తాగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. జులై 29న చిత్రీకరించిన ఈ వీడియోలు, ఫొటోలను ఆ విద్యార్థుల్లో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు డీఈవో టి.ఆర్.సాహు మంగళవారం తెలిపారు. పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూల్ ప్రిన్సిపల్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
విచారణ కమిటీ సంబంధిత విద్యార్థులు, ఉపాధ్యాయుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. సరదాగా బీరు బాటిళ్లను చేతుల్లోకి తీసుకొని ఊపామని, తాగలేదని విద్యార్థినులు కమిటీ ఎదుట చెప్పారు. ఈ ఘటనతో ప్రమేయమున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం నోటీసులు పంపి, వివరణ కోరుతామని డీఈవో చెప్పారు.